Followers

Search This Blog

Theme images by MichaelJay. Powered by Blogger.

About Simpro

Find Us On Facebook

About Me

My photo
hi, Iam Ravindra nath Tagore. I have to create this blog to write articles on some great persons and social elements to motivate all. This is very useful to you.

Gallery

About the Author

Featured post

గాంధీజీ ఆత్మహత్యాప్రయత్నం..! -- గాంధీ జీవిత విశేషాలు -- 03

                  జీవితంలో మంచి వ్యక్తుల స్నేహం మంచి జీవితాన్ని ప్రసాదిస్తే, చెడు స్నేహం మాత్రం జీవితపు లోతులను తెలుసుకోగలిగేలా చేస్...

Contact Form

Name

Email *

Message *

Popular Posts

బాధాకరమైన జీవిత ప్రయాణం -- మైఖేల్ జాక్సన్


                                                   పాప్ సంగీత ప్రపంచంలో అతను ఓ రాజు, కాదు కాదు రారాజు. కోట్లాది మంది సంగీత ప్రియులకు అతను దేవుడు. తన ఆటతో, తన పాటతో, సంగీత ప్రియులను ఉర్రుతలూగించాడు. పాప్ సంగీత ప్రపంచంలో నాలుగు దశాబ్దాల పాటు ఎదురు లేని మహా శిఖరంగా నిలిచి, కింగ్ ఆఫ్ పాప్ గా జనం చేత జేజేలు అందుకున్నాడు. ఎంత సాధించినా అతని జీవితం చిత్ర విచిత్ర పయనం. జీవితంలో అన్నింటినీ సాధించి, చివరికి తనకంటూ ఏమి లేకుండా, అన్నీ కోల్పోయాడు. తాను నమ్మిన వాళ్లే తన జీవితానికి మరణ శాసనం రాసారు. తనతో కాలం ఆడుకున్న ఆటలో తాను ఓడిపోక తప్పలేదు. చివరికి చరిత్రలో, గెలిచి, ఓడిన వ్యక్తిగా నిలిచిపోయాడు. అతనే మైఖేల్ జాక్సన్.

➤ మైఖేల్ జాక్సన్ బాల్యం:


                     అమెరికాలో ఓ నిరుపేద నల్ల జాతి కుటుంబంలో 1958 అగస్ట్ 29 న జన్మించాడు మైకేల్. తొమ్మిది మంది సంతానంలో ఏడవవాడు మైఖేల్. తన తండ్రి జోసెఫ్ జాక్సన్ జీవితంలో ఎన్నో సాధించాలని కలలు  కన్నాడు.  అవేవి సాధించక చివరికి తన అసహాయతను, తన కోపాన్ని తన పిల్లలపై చూపించేవాడు. వారికి  తనే స్వయంగా సంగీత శిక్షణనిచ్చేవాడు. ఏ చిన్న తప్పు చేసిన వారికి నరకాన్ని చూపించేవాడు.చిన్న వయసులోనే తన తండ్రి వల్ల ఎన్నో చిత్ర హింసలకు గురయ్యాడు. ఐదేళ్ల వయసులోనే మైఖేల్ తన సోదరులతో కలిసి అమెరికా  రోడ్ల మీద సంగీత ప్రదర్శనలిచ్చేవాడు. అతి తక్కువ కాలంలోనే  మంచి పేరును సంపాదించారు.

➤ పాప్ స్టార్ గా మైఖేల్ :


                        ఆ తరువాత మైఖేల్ సొంత గుర్తింపు కోసం, సొంతంగా ప్రదర్శనలివ్వటం మొదలు పెట్టాడు. తాను విడుదల చేసిన Off the wall, Music and me, Ben వంటి ఆల్బమ్ లు తనను  ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగేలా చేసాయి.తాను విడుదల చేసిన ఆల్బమ్ లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మైఖేల్ విడుదల చేసిన Thriller ఆల్బమ్ అప్పట్లో పెను సంచలనాన్నే సృష్టించింది. అప్పటివరకు ఉన్న రికార్డు లను కొల్లగొట్టి, బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా  కొత్త రికార్డులను సృష్టించింది. అంతే కాదు ఏకంగా ఏడు గ్రామీ అవార్డులను గెలుచుకుంది.1983 లో  ఒక ప్రదర్శనలో తాను  వేసిన మూన్  వాక్ స్టెప్ తో జనులందరిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డులు తన  ప్రతిభకు దాసోహం అయ్యాయి. ఏకంగా 13 గ్రామీ అవార్డులు, 39 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు, 16 వరల్డ్ మ్యూజిక్ అవార్డులతో మైఖేల్ జాక్సన్ సంగీత ప్రపంచంలో తనకు తిరుగులేదనిపించుకున్నాడు.

➤ ముఖానికి ఎన్నో సర్జరీలు :

                      
                  1981 నుంచి మైఖేల్ జాక్సన్   రూపు మారటం మొదలైనది. ఒక రకమైన మచ్చలతో శరీరం రూపు కోల్పోవటం తో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. 1979 లో ఒక ప్రదర్శనలో డాన్స్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కిందకు పడటంతో తన ముక్కు కు గాయం అవటంతో, ఊపిరి కూడా పీల్చుకుపోలేని స్థితిలో ముక్కు కు సర్జరీ చేయించుకోక తప్పలేదు. 1984 లో స్టేజ్ మీద డాన్స్ చేస్తుండగా, చుట్టు  పక్కల ఉన్న బాణాసంచా ఒక్క సారిగా పేలటం తో, ఆ మంటలు మైఖేల్ జాక్సన్ తలకు అంటుకోవటంతో , జుట్టు పూర్తిగా కాలిపోయి, తలకు గాయాలు అయ్యాయి. ఇందుకోసం మరొక్కసారి సర్జరీ చేయించుకున్నాడు. ఇలా రకరకాల సర్జరీలతో మైఖేల్ శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనను అనుభవించాడు.


 పిల్లల మీద తనకున్న ఇష్టంతో కాలిఫోర్నియాలో 200 ఎకరాలలో పిల్లలు సరదాగా గడపటానికి Never Land అనే పేరు తో ఓ నిర్మాణాన్ని నిర్మించాడు  మైఖేల్. 

➤ జీవితంలో ఎన్నో వివాదాలు :

                                కష్టాలు ఎవరికి అతీతం కావు. కాలం ఎవరికి అనుకూలం కాదు. మైఖేల్ జాక్సన్ జీవితానికి  ఇది సరిగ్గా సరిపోతుంది. చిన్న పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు రావటంతో రెండు సార్లు కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. ఎంతో డబ్బును పోగొట్టుకోవలసి వచ్చింది. చివరికి కోర్టు మైఖేల్ జాక్సన్ ను నిర్దోషిగా ప్రకటించినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది. ఒక వైపు తన వ్యక్తిగత ఖర్చులు,  Never Land ఖర్చులు పెరిగిపోవటంతో మైఖేల్ అప్పుల్లో కూరుకుపోయాడు. తాను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న  Never Landను కూడా అమ్మవలసి వచ్చింది. రెండు సార్లు పెళ్లి చేసుకున్నప్పటికి, అవి సఫలం కాలేదు. ఇలా రకరకాల కారణాలతో మైఖేల్ ఒంటరిగా గడిపేవాడు. సెలబ్రిటీ హోదాను అనుభవించలేకపోయాడు. మనుషులపై భయాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నాడు. అనేక ఆరోగ్య సమస్యలు తన శరీరాన్ని వ్యధకు గురిచేశాయి. శారీరక, మానసిక బాధలతో  మైఖేల్ జాక్సన్ 2009 జూన్ 25 న ఈ లోకాన్ని వీడిపోవలసి వచ్చింది. ఈ నాడు మైకేల్ జాక్సన్ మన మధ్య లేకపోయినా, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అతను ఎప్పటికీ చిరంజీవే.


          అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మైఖేల్ జాక్సన్ Propofol అనే మత్తు మందును తీసుకోవటం వల్లనే చనిపోయాడని నిర్దారించారు. దీనిని తన పర్సనల్ డాక్టర్ ముర్రే సలహా వలనే మైఖేల్ వాడాడని తెలిసింది. మైఖేల్ మరణానికి పరోక్షంగా కారణమైన  డాక్టర్ ముర్రేకు కోర్టు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.

              

                  అమెరికా రోడ్ల మీద సంగీత ప్రదర్శనలిచ్చే స్థాయి నుండి, అదే అమెరికాలో తిరుగులేని పాప్ స్టార్ గా ఎదిగాడు మైఖేల్. జాత్యహంకారం తో ఊగిపోతున్న అమెరికన్లను, తన స్టెప్పులతో మైకంలో ముంచాడు. తాను ఆడిన ఆటకు, తాను పాడిన పాటకు ప్రపంచమే తనకు దాసోహం అంది. తన ప్రతిభ తో ఎంత వేగంగా అయితే ఎదగగలిగాడో, అంతే వేగంగా పాతాళాన్ని చేరుకున్నాడు. తాను ఎంతో సాధించినప్పటికీ, చివరి రోజుల్లో తాను అనుభవించిన మానసిక క్షోభ వర్ణనాతీతం. కాలం తనతో ఆడుకున్న ఆటలో తాను ఓడిపోక తప్పలేదు. చివరి రోజుల్లో తనకంటూ ఏమి మిగలలేదు ఒక్క తన కష్టాలు తప్ప. అందుకే యాభై ఏళ్ళలో తాను సాగించిన జీవితం, చిత్ర విచిత్రాల పయనం. ఏది ఏమైనప్పటికి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి, కోట్లాది మంది సంగీత ప్రియుల మనసులు గెలవటమే కాదు, కోట్లాది మందికి  ఆదర్శంగా నిలిచాడు మైఖేల్ జాక్సన్.

                                                                                                 by
                                    
                                   M.R. Ravindra Nath Tagore
                                                                     TELUGUINSPIRE.BLOGSPOT.IN


జాతిని, జగతిని జాగృతం చేయటానికి అవనిపై జనయించిన ఎందరో మహానుభావుల గురుంచి మున్ముందు మరింతగా తెలుసుకొందాం.
Read More
    5

లే... మేలుకో... గమ్యాన్ని చేరుకో..

             
                                    1947 అగస్ట్ 15 భరత మాతకు దాస్య శృంఖలాలు తెగిపడిన రోజు. భారత జాతి యావత్తు స్వేచ్ఛ   వాయువులు పీల్చుకున్న ఘనమైన రోజు.స్వతంత్ర దేశం కోసం ప్రాణాలను, జీవితాలను పోగొట్టుకున్న ఎందరో మహానుభావుల కలలు నిజమైన రోజు. ఈ సువిశాల,  ప్రజాస్వామ్య, గణతంత్ర భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి డెబ్భై సంవత్సరాలు గడిచినా సాధించింది ఎంతో ఉన్నా, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇంకెన్నాళ్లు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండాలి. ఏ దేశానికి లేని యువ శక్తి కేవలం మన భారత దేశం సొంతం.అసమాన, అసాధారణ ప్రతిభ మన యువత సొంతం. ఇటువంటి ఈ భారత దేశ యువత తలుచుకుంటే మన దేశం  ఒక అత్యుత్తమ శక్తిగా ఎదగటం గొప్ప విషయం కాదు.
Hiroshima town after II world war

old singapore






                     రెండవ ప్రపంచ యుద్ధం లో రెండు అణుబాంబులు తన గుండెలపై పడి, అతలాకుతలం చేసినా , అదరకుండా, బెదరకుండా,ఒక సూపర్ పవర్ కంట్రీ గా ఎదిగింది జపాన్.1965 లో బానిస సంకెళ్లు తెచ్చుకొని స్వతంత్ర దేశంగా ప్రాణం పోసుకొంది సింగపూర్. ఎన్నో గడ్డు పరిస్థితులు, ఇంకెన్నో అవాంతరాలు, అడుగడుగునా పేదరికం తాండవించింది అయినా దారుణ పరిస్థితులకు ఎదురొడ్డి నేడు అత్యుత్తమ దేశాలలో ఒకటిగా నిలిచింది సింగపూర్. ఆ  దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి, మన దేశం ఎందుకు దశాబ్దాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలింది. ఇందుకు కారణాలెన్నో ఉండి  ఉండవచ్చు, వాటిని సమర్థించుకుంటూ ఉంటే అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోతాము. అదే కారణాలను విశ్లేషించుకుని, మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే అభివృద్ధి గురించి ఆలోచించగలం.


                                         అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని చూసినా, ఆ దేశంలో కూలి పని చేసుకొనే వాడి నుండి, దేశాన్ని ఏలే అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో నా దేశం అనే భావన, నా దేశం అభివృద్ధి చెందాలనే పట్టుదల బలంగా ఉంటుంది. అలాగే మన గుండెల్లోనూ ఒక భావన ఉంది,  నా కులం అభివృద్ధి చెందాలని, నా మతం అభివృద్ధి చెందాలని, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని.ఇటువంటి భావాలతో అభివృద్ధి సాధ్యమా? మనలో ఎంత మందికి నా దేశం అన్న భావన గుండెల్లో ఉంది. ఓట్ల కోసం కొంత మంది రాజకీయ నాయకులు వేసిన కులాల, మతాల, మత్తులో ఊగుతున్నాం.  ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే , కోట్లకు కోట్లు అక్రమంగా సంపాదించి ఏసీబీ అధికారులకు దొరుకుతున్న ఎందరో అవినీతి తిమింగలాను రోజు చూస్తూనే ఉన్నాం. ఓట్ల కోసం ఇల్లిల్లు తిరిగి, గెలిచిన తరువాత అభివృద్ధి అన్న పదాన్నే మరిచిన ఎంతో మంది  నాయకులు మనకు కనబడుతూనే ఉన్నారు. ఇటువంటి వారు పుట్టుకు రావటానికి కారణం ఎవరు. నువ్వా? లేక నేనా ? వ్యవస్థలో లోపం ఉందా?ఆ వ్యవస్థలో ఉన్న మనలో లోపం ఉందా? కారణం ఏమైనా కావచ్చు. ఇటువంటి వారు ఉన్నంత కాలం 130 కోట్ల మంది భారతీయులలో  ఏ ఒక్కరు అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలను పాలించే నాయకులలోను,ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులలోను అవినీతి    తాండవిస్తున్నంత కాలం భారత దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతుంది.

                         
               కేవలం ఒక్క అవినీతి అంతం అయిపోతేనే  దేశం అభివృద్ధి జరగదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలు గొప్పగా ఉండాలి. ఆ ఆలోచనలు దేశ మార్పు కోసం ఉపయోగపడాలి. భగత్ సింగ్,ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లాగా దేశం కోసం ప్రాణాలు అర్పించే ఆ అవసరం మనకిప్పుడు లేదు. కానీ వారు కన్న కలల భారతాన్ని నిర్మించే భాద్యత భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిపైనా ఉంది. అభివృద్ధి  కోసం మనం చేయవలసిన పనులు చాల చిన్నవే. అందులో మొదటిది ఈ సువిశాల భారత దేశం లో మనం కూటి కోసం ఏ పని చేసినా అది అవినీతి రహితంగా, బాధ్యాతాయుతంగా చేయాలి. రెండవది రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో అభివృద్ధి ని కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలి. మూడవది కులాల, మతాల, ప్రాంతాల కుంపట్లను వదిలి నేను భారతీయున్ని అన్న భావన మనసులో ఏర్పరుచుకోవాలి. అప్పుడే  మనం పొందిన స్వాతంత్ర్యానికి, అందుకోసం పోరాడి ప్రాణాలను అర్పించిన మహానుభావుల కలలకు అర్థం ఉంటుంది.

          ఇప్పుడైనా......

     లే.... మేలుకో........ నీ గమ్యమేంటో ఇప్పుడే నిర్ణయించుకో ....... ఈ క్షణమే నిర్ణయించుకో...... దేశం కోసం  శ్రమించు...... జాతి యావత్తు గర్వపడేలా ఎదుగు.......... లే ............⇑
                                                                                        by
                                                                                                  
                                         M.R. Ravindra Nath Tagore
                                   TELUGUINSPIRE.BLOGSPOT.IN
Read More
    10

ప్రతి భారతీయుడికి స్ఫూర్తి నింపే జీవితం -- రతన్ టాటా

         

                                   పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని  ఒక్కడు ఒకే ఒక్కడు తన యుక్తి తో,తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేసాడు. దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ,నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ను అందనంత ఎత్తులో నిలబడేలా చేసాడు. నేడు ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్కుల వరకు ఇలా ప్రతి వ్యాపారంలో లోను ఖచ్చితంగా TATA పేరు వినిపిస్తుంది.ఇంతటి ఘన చరిత్రను టాటా గ్రూప్ కు కట్టబెట్టేలా చేసాడు అతను. అతనే రతన్ టాటా. కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శప్రాయడు ఈ జీవన విజేత.


రతన్ టాటా గురించి:

J.R.D టాటా తో రతన్ టాటా
                           1937 డిసెంబర్ 28 న దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించాడు రతన్. ఏడేళ్ల వయసులోనే తల్లి తండ్రులిద్దరూ విడిపోవటంతో నాయనమ్మ దగ్గర పెరగవలిసి వచ్చింది. తన చదువును అమెరికాలోనే పూర్తి చేసుకొని J.R.D టాటా పిలుపు మేరకు జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటీస్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు రతన్. ఎప్పటికప్పుడు  కొత్త కొత్త ఆలోచనలతో, తన నైపుణ్యంతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదిగగలిగాడు రతన్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసిన తరువాత 1991 లో J.R.D టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించాడు రతన్. అప్పట్లో ఈ నిర్ణయాన్ని బోర్డు అఫ్ మెంబెర్స్ లో చాలా మంది వ్యతిరేకించారు. అనుభవం లేని రతన్ చేతిలో ఇన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడవలేదని అందరు వాదించారు. కానీ వారికి ఆనాడు తెలియదు పాపం ఇతడే టాటా గ్రూప్ ను దశదిశలా వ్యాపించే ఘనుడు అవుతాడని.

చైర్మన్ గా రతన్ టాటా:
                     
                చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత టాటా గ్రూప్ లో సమూల ప్రక్షాళన చేసాడు రతన్. రాత్రి పగలు కష్టపడి పది వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని తన అసాధారణ వ్యాపార నైపుణ్యంతో ఆరు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీగా మార్చాడు రతన్. దేశ వాణిజ్య , పారిశ్రామిక పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. నేడు టాటా గ్రూప్ 90 కి పైగా దేశాలలో విస్తరించి వందకు పైగా వ్యాపారాలలో తన ముద్రను వేసి, దేశంలోనే కాదు, ప్రపంచం లోనే అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా నిలబడింది. వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరంగా ఎదగగలిగింది.ప్రతి  మధ్య తరగతి వాడికి సొంతంగా ఒక కారు ఉండాలనే ఉద్దేశంతో కేవలం లక్ష రూపాయలకే  టాటా నానో కారును మార్కెట్లోకి తెచ్చి పెను సంచలనాన్నే సృష్టించాడు రతన్.

నానో కారు ఓ సంచలనం:
  నానో కారుతో రతన్ టాటా
                        
                             టాటా గ్రూప్ భారత దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. నేడు ఎయిర్ ఇండియా గా పిలబడుతున్న విమానయాన సంస్థను మొదట టాటాఎయిర్ లైన్స్ పేరుతో 1868 లో జంషెడ్ జీ టాటా స్థాపించాడు. కాలక్రమంలో అది కాస్త ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది. అలాగే భారత దేశంలో మొట్టమొదటి హోటల్ అయిన తాజ్ హోటల్ ను ప్రారంభించింది కూడా టాటాలే. బ్రిటన్ కు చెందిన tetley అనే కంపెనీని టాటా టీ లో కలుపుకొని  ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీ గా టాటా టీ ఎదిగింది. అంతే కాదు మనల్ని పాలించిన బ్రిటిషర్లకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు రతన్ టాటా. ఎన్నో విదేశీ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటా ను ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగేలా చేసాడు. 


రతన్ టాటాకు అవమానాలు, అవరోధాలు:

ఇండికా కారు తో రతన్ టాటా

                      1998 లో టాటా  ఇండికా కార్లను ప్రవేశ పెట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆ కార్లు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవటం తో రతన్  టాటా ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మేయాలని భావించాడు. ఇందు కోసం అమెరికా లోని ఫోర్డ్ కంపెనీకి తన టీం తో పాటు రతన్ టాటా కూడా వెళ్లారు. అయితే ఫోర్డ్ కంపెనీ చైర్మన్,రతన్ టాటా ను మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసారు అని అవమానించాడు. ఈ సంఘటనతో ఆ డీల్ మాట్లాడకుండానే వెనుదిరిగి వచ్చేసారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాలనుండి లాభాల లోకి రావటం మొదలు పెట్టింది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా , అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్ ,లాండ్రోవర్ కార్లు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయం లోనే రతన్ ఆ రెండు కంపెనీలను నేను కొంటాను అని ఫోర్డ్ కంపెనీకి ఆఫర్ చేసాడు రతన్. అప్పుడు ఫోర్డ్ కంపెనీ చైర్మన్ తన టీం తో అమెరికా నుండి ముంబై కు వచ్చాడు. ఆ విధంగా తనను అవమానించిన వారికే గుణపాఠం చెప్పాడు రతన్.

ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులతో రతన్ టాటా
 
                              నానో కార్ల ఉత్పత్తి కోసం పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ప్లాంటును అక్కడి రైతులు వ్యతిరేకించడంతో ,ఆ ప్లాంటు మరొక చోటుకు మార్చటంతో వేల కోట్ల నష్టాన్ని చూడవలసి వచ్చింది .
      పాకిస్థాన్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తాజ్ హోటల్ పై జరిపిన ఉగ్ర దాడిలో వందల మంది అతిథులను, తమ ఉద్యోగస్థులను పోగొట్టుకోవాల్సివచ్చింది. ఈ సంఘటన రతన్ ను మానసికంగా ఎంతో బాధించింది.

రతన్ టాటా  ఒక గొప్ప దానశీలి: 


                  లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలకు అధిపతులైనా టాటా వంశీయులు ఇంతవరకు ఏనాడూ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో నిలవలేదు. ఎందుకంటే టాటా గ్రూప్ నుండి వచ్చే లాభాలలో 66శాతం టాటా ట్రస్టులకు విరాళంగా ఇవ్వటం జరుగుతుంది. దేశ సామజిక పరిస్థితులు మెరుగుపరచటానికి టాటా ట్రస్టులు ఎంతగానో కృషి చేస్తున్నాయి.తాజ్ ఉగ్ర దాడిలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయమందించాడు రతన్. బ్రహ్మచారి గా ఉంటూ నలుగురి బాగు కోసం బతుకుతున్న మహనీయుడు రతన్ టాటా. తన ప్రతిభను మెచ్చి పలు దేశాలలోని యూనివర్సిటీలు తనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అంతే కాదు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో రతన్ ను గౌరవించింది. 

పద్మ భూషణ్ ను స్వీకరిస్తూ


పద్మ విభూషణ్ ను స్వీకరిస్తూ
                   కోట్లకు అధిపతి అయినా ఏనాడూ కుసుమంత గర్వాన్ని కూడా ప్రదర్శించలేదు రతన్ టాటా. 79 ఏళ్ళ వయసులోనూ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు రతన్.నేడు రతన్ టాటా అంటే ఒక వ్యక్తి కాదు,ఒక సంస్థ , ఒక బ్రాండ్. వీటన్నిటికీ మించి సృజనాత్మకత , దార్శనికత ఉన్న ఒక గొప్ప మానవతావాది. నేడు 130 కోట్ల మంది భారతీయులు మనసారా సగర్వంగా ఇతడు మా భారతీయుడు అని చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటాడు రతన్ టాటా. అతని సాగించిన జీవన ప్రయాణం నేడు మనందరికీ స్ఫూర్తిదాయకం.
           గుర్తుపెట్టుకోండి

                తన వల్ల ఏమి చేతకాదంటూ తనను నమ్మని వారికి ,అసలు తనకు వ్యాపారమే  రాదని అవమానించిన వారికి, తనలో ఉన్న నైపుణ్యంతో ,తన చేతలతో సమాధానం చెప్పాడు రతన్ టాటా. మన చుట్టూ కూడా ఎంతో మంది  మన వల్ల  ఏమి చేత కాదని,మనం ఏమి సాధించలేమని మనల్ని అవమానించిన వారు ఉండిఉంటారు. అటువంటి వారందరికీ మీ చేతలతో సమాధానం చెప్పటానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మీరు సిద్ధమా ?
                                                           ఆలోచించండి.
                                                                         ఒక్కసారి ఆలోచించండి.

                                                                                          by
 
                                              M.R . Ravindra Nath Tagore

                                                                     TELUGUINSPIRE.BLOGSPOT.IN

         
జాతిని, జగతిని జాగృతం చేయటానికి అవనిపై జనయించిన ఎందరో మహానుభావుల గురుంచి మున్ముందు మరింతగా తెలుసుకొందాం.
Read More
    3

ఇద్దరు స్నేహితుల కన్నీటి విజయ గాథ -- వాట్సాప్


                ఇద్దరు స్నేహితులు ఒక పెద్ద కంపెనీలో తొమ్మిది సంవత్సరాలుగా  పని చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని, తమను తాము నిరూపించుకోవటానికి,ఏదో సాదించటానికి, ఈ సమాజములో ఒక గుర్తింపు కోసం బయటకు  వచ్చేసారు. బయటకు వచ్చిన తరువాతే  వారికి అసలు కష్టాలు ఎదురయ్యాయి. అందుకు నిరాశ, నిస్పృహలు కూడా తోడయ్యాయి. జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కొని నిలబడ్డారు. తమలో ఉన్న ఒక ఆలోచనకు రూపం ఇవ్వటానికి రాత్రి పగలు కష్టపడ్డారు. చివరికి కష్టాల కడలిని దాటి, విజయ తీరాలను చేరుకొని, గెలుపు జెండాను ఎగురవేశారు.
 
Brian acton & jan  koum
                          ఆ స్నేహితులే జాన్ కౌ మరియు బ్రియాన్ యాక్టన్. వారు సృష్టించిన ఆ యాప్ వాట్సాప్. కమ్యూనికేషన్ రంగం లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది వాట్సాప్.  అప్పటికే సునామీలా దూసుకొస్తున్న పేస్ బుక్ ఒరవడిని తట్టుకొని తన సత్తా చాటుకొంది వాట్సాప్. జాన్ ను మరియు బ్రియాన్ ను విజేతలుగా నిలబెట్టింది. ఆ స్నేహితులు పడిన కష్టాలే ఈనాటి మన

జాన్ గురించి :
                             ఉక్రెయిన్ లో నిరుపేద కుటుంబం లో పుట్టిన జాన్ చిన్నప్పుడే ఎన్నో కష్టాలను  ఎదుర్కొన్నాడు. తాను ఉంటున్న ఇంట్లో కనీస సదుపాయాలు కూడా ఉండేవి కావు. పదహారు సంవత్సరాల వయసులోనే తన తల్లి తో పాటు తాను కన్న కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఉక్రెయిన్ నుంచి అమెరికా కు వలస వచ్చాడు జాన్. రోజు ఖర్చులకు డబ్బులు కూడా లేని స్థితిలో అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ స్టాంపుల కోసం వేచిచూడ వలసి వచ్చింది. ఆ కష్టాలను ఎదుర్కోవటానికి పదహారేళ్లకే ఒక గ్రోసరీ  స్టోర్ లో క్లీనర్ గా పనిచేయవలసివచ్చింది. ఆ సమయం లోనే తన తల్లికి కాన్సర్ అన్న విషయం తనను మరింత వేదనకు గురి చేసింది.

                              ఆ తరువాత కంప్యూటర్ ల పైన, ప్రోగ్రామింగ్ పైన ఇష్టాన్ని పెంచుకున్న జాన్, వాటి పై పట్టు సాధించటం మొదలు పెట్టాడు. ప్రోగ్రామింగ్ పుస్తకాలను అద్దెకు తెచ్చుకొని చదువుకునేవాడు. ఆ ఇష్టమే తనను సాంటోస్ స్టేట్ యూనివర్సిటీ వరకు కు వెళ్లగలిగేలా చేసింది. అయితే యూనివర్సిటీ చదువును మధ్యలోనే  ఆపేసి ,యాహు కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాడు జాన్. అక్కడే జాన్ కు బ్రియాన్ ఆక్టన్ పరిచయం అయ్యాడు. జీవితం  సంతోషంగా సాగిపోతున్న తరుణంలో తన తల్లి మరణం జాన్ ను ఒంటరి వాడిని చేసింది. ఆ సమయయంలో బ్రియాన్ యాక్టన్ తనకు అండగా నిలబడ్డాడు.

వాట్సాప్ కు రూపం:

                     ఏదో సాధించాలన్న కసి తో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకొని కొత్త ఆలోచనలో పడ్డారు మిత్రులు. అప్పుడే ఒక కొత్త ఐ ఫోన్ కొన్న జాన్, అందులో ఉన్న యాప్ స్టోర్ పాతది కావటం తో ఆపిల్ కంపెనీ వారు, కొత్త యాప్ స్టోర్ ను విడుదల చేయాలని అనుకుంటారు. ఈ సంఘటనే జాన్ లో కొత్త ఆలోచనకు ప్రాణం పోసింది. భవిష్యత్ లో యాప్ లకు  మంచి డిమాండ్ ఉందని గ్రహించాడు జాన్. వెంటనే ఒక కొత్త మెస్సేజింగ్ యాప్ తయారుచేయాలని  అనుకున్న జాన్, ఆ ఆలోచనను బ్రియాన్ ఆక్టన్ తో పంచుకొని దానికి వాట్సాప్ అని పేరు పెట్టాడు. ఆ విధంగా  2009వ సంవత్సరంలో ఫిబ్రవరి 24వ తేదీన వాట్సాప్ జీవం పోసుకుంది. అయితే వాట్సాప్ ను స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసివచ్చింది. తొలి నాళ్ళల్లో వాట్సాప్ ఎక్కువగా సృక్ అవుతూండేది.దీనిని ఎదుర్కోవటానికి జాన్ ఎంతో  శ్రమించవలసి వచ్చింది.  ఒకానొక తరుణంలో వాట్సాప్ పై ఉన్న ఆశలన్ని వదిలేసుకొన్నాడు జాన్. బ్రియాన్ ఇచ్చిన స్ఫూర్తి తో తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు జాన్.

                      ఎప్పటికప్పుడు కొత్త కొత్త  ఫీచర్స్ తో విడుదలవుతున్న వాట్సాప్, యూజర్లను ఆకట్టుకుంటూ దూసుకుపోయింది.అప్పటికే సునామీలా దూసుకొస్తున్న ఫేస్ బుక్ ఒరవడిని తట్టుకొని తన సత్తా చాటుకొంది వాట్సాప్.
కమ్యూనికేషన్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టించి,నేడు కొన్ని కోట్ల మంది మనసులను కొల్లగొట్టింది వాట్సాప్.

                    అయితే 2014 వ సంవత్సరంలో వాట్సాప్ ఊహించని స్థాయికి వెళ్ళింది. వాట్సాప్ కంపెనీను ఫేస్ బుక్ దాదాపు 19 బిలియన్ డాలర్లు అంటే లక్షా 20 వేల కోట్ల రూపాయలు చెల్లించి తన సొంతం చేసుకొంది. అలాగే జాన్ కు  ఫేస్ బుక్ లో బోర్డు మెంబర్ షిప్ కూడ లభించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తమ్ సిలికాన్ వ్యాలీలో ఒక చిన్న బిల్డింగ్ లో పూర్తి చేసాడు జాన్. ఒకప్పుడు అక్కడే తన తల్లితో పాటు ఫుడ్ స్టాంపుల కోసం నిలబడ్డాడు. అదే చోట లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.

వాట్సాప్ గురించి మరికొన్ని విశేషాలు:
➤ వాట్సాప్ ను ప్రమోట్ చేసుకోవటానికి ఏనాడూ ఒక్క డాలర్ కూడా ఖర్చుపెట్టలేదు.

➤ బ్రియాన్ యాక్టన్ ఫేస్ బుక్ లో జాబ్ కోసం అప్లై చేసుకోగా , బ్రియాన్ ను ఆ కంపెనీ తిరస్కరించింది.


➤ మన భారత దేశం వాట్సాప్ కు ఎక్కువగా యూజర్లు ఉన్న దేశం.దాదాపు 20 కోట్ల మంది యూజర్లను కలిగి ఉంది.

➤ ఇప్పటికి వాట్సాప్ లో కేవలం 55మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు.

➤ ఇప్పుడు వాట్సాప్ కు దాదాపు నెలకు 450 మిలియన్ల యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.

➤ వాట్సాప్  ద్వారా ఒక రోజుకు 5వేల 5 వందల కోట్ల మెసేజ్ లు పంపబడుతున్నాయి.

➤ ఒక యూజర్ సగటున నెలకు వాట్సాప్ ద్వారా 1000 మెసేజ్ లు పంపుతున్నాడు.

➤ ఒక రోజులో వాట్సాప్ ద్వారా దాదాపు 450 కోట్ల ఫోటోలు  షేర్ అవుతున్నాయి.

➤ ఒక రోజులో వాట్సాప్ ద్వారా దాదాపు వంద కోట్ల వీడియోలు  షేర్ అవుతున్నాయి.

➤ ప్రతి రోజు పది లక్షల మంది కొత్తగా వాట్సాప్ లో రిజిస్టర్ అవుతున్నారు.

➤ చైనా ,ఇరాన్ లలో వాట్సాప్ ను బ్లాక్ చేయటం జరిగింది.

             
                  గుర్తుపెట్టుకోండి
                            నాడు  అమెరికా రోడ్ల మీద అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. తనను తాను నిరూపించుకోవటానికి రాత్రి,పగలూ కష్టపడ్డాడు. నేడు అదే అమెరికాలో బిల్లియనీర్లలలో  ఒకడిగా నిలబడ్డాడు జాన్.కాలం తనను ఒంటరివాడిని చేసినా,జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం నుండి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకొన్నాడు జాన్. తాను కన్న కలలకు, ఊహించిన ఊహలకు రూపు ఇవ్వటం కోసం రాత్రి, పగలు కష్టపడ్డాడు.నిరాశ, నిస్పృహలు తన వెంటే ఉండి తనను వెక్కిరించినా,విజయ తీరాలను చేరుకోవాలనే తన పట్టుదల,చెక్కు చెక్కుచెదరని తన ఆత్మ విశ్వాసం , తనను ఈ రోజు లక్షల కోట్లకు అధిపతిని చేసింది. కొన్ని కోట్ల మంది యువతకు స్ఫూర్తి ప్రదాతను చేసింది.                           
                 
                           తమకు అవకాశాలు రావని,తమలో నైపుణ్యాలు లేవని, జీవితంలో ఏదయినా సాదించకపోవటానికి కారణాలుగా చెప్పే కొంత మంది యువతకు జాన్ జీవితం కొంతయినా స్ఫూర్తిని ఇవ్వదా?   

                                                                      ఆలోచించండి.   
                                                                              ఒక్కసారి ఆలోచించండి.                                                                
                                                                          by
                                                                             
                                         M.R. Ravindra Nath Tagore
                                               
       
Read More
    4

పెట్రోల్ బంక్ లో పనిచేసిన అంబానీ కథ


                                   పేదరికం అతనికి చాలా దగ్గరి బంధువు. ఎప్పుడూ తన వెంటే ఉంటుంది. సరస్వతి దేవి అతనికి దూరపు బంధువు, అందుకే పదవతరగతికి మించి చదువు సాగలేదు.తనకంటూ చెప్పుకోవటానికి ప్రత్యేకంగా ఏమిలేదు. అయినా మనసులో ఏదో సాధించాలనే సంకల్పం, గెలుపుకోసం ఎంతకైనా తెగించే పోరాట తత్వం, నిప్పులాంటి తన ఆశయం, ఒక వ్యక్తిని విజేతను చేశాయి. నేడు ఆ వ్యక్తి మనందరికి ఆదర్శం. అతడే ధీరుభాయి అంబానీ.అతని జీవిత చరిత్రే ఈనాటి మన జీవన విజేత గాథ.

                                తనను కన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూడలేక పదహారు సంవత్సరాల వయసులోనే దేశం కాని దేశంలో కష్టాల కడలిని దాటడానికి పెట్రోల్ బంక్ లో పనిచేయవలసి వచ్చింది.అయినా అందుకు ఏనాడూ బాధపడలేదు. ఇదే తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావించాడు.వ్యాపారం పై మక్కువ పెంచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ను స్థాపించాడు. ఇప్పుడు రిలయన్స్ అంటే ఒక కంపెనీ కాదు, ఒక బ్రాండ్.2,50,000 మంది ఉద్యోగులతో దేశంలోనే రెండవ అతి పెద్ద కంపెనీగా రిలయన్స్ విరాజిల్లుతోంది



ధీరుభాయి అంబానీ గురుంచి:                            
         
                 1932 డిసెంబర్ 28 న గుజరాత్ లో ఓ సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు ధీరూ భాయ్ అంబానీ. తండ్రి పాఠశాల ఉపాద్యాయుడు కావటంతో సహజంగానే చిన్నప్పటి నుంచే ప్రతి విషయం లో ఎంతో నిజాయితీగా ఉండేవాడు ధీరూతన తండ్రి కి వచ్చే జీతంతో ఇల్లు గడవటం కష్టమని గ్రహించి, చదువు మానేసి ,ఉద్యోగ వేటలో పడ్డాడు ధీరూ. భారత దేశాన్ని విడిచి యెమన్ దేశంలో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసాడు. అక్కడే పలు రకాల ఉద్యోగాలు చేసి వ్యాపారం పై ఒక అవగాహనను ఏర్పరుచుకొన్నాడు. ఒక కంపెనీని ఏ విధంగా ప్రారంభించాలి, అకౌంటింగ్స్ ఎలా చూడాలి,వంటి ఎన్నో విషయాలను తెలుసుకొన్నాడు.

రిలయన్స్ కు శ్రీకారం:
  
                1962 లో పుట్టిన  గడ్డ మీద మమకారంతో, సంపాదించిన పదిహేనువేల రూపాయలతో  సొంత దేశానికీ తిరిగొచ్చాడు ధీరూ అంబానీ.వ్యాపారం చేయాలని మనసులో ఆతృత. కానీ చేతిలో ఉన్న డబ్బు సరిపోదు. అయితేనేం మరికొంత డబ్బును అప్పుగా తీసుకొని రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ను ఒక చిన్న గదిలో ప్రారంభించాడు. విదేశాల నుండి పాలిస్టర్ ను దిగుమతి చేసుకొని మసాల దినుసులను ఎగుమతి చేసేవాడు. తన ఆసాధారణ ప్రతిభ వల్ల  చేసిన  ఆ వ్యాపారంలో విజయం సాధించాడు. 1977 లో గుజరాత్ లోని అహ్మదాబాద్ దగ్గర టెక్సటైల్ మిల్లును స్థాపించాడు. తాను ఉత్పత్తి చేసిన బట్టలను విమల్ బ్రాండ్ పేరు తో మార్కెట్ లోకి  తెచ్చి విజవంతం అయ్యాడు. ఆ తరువాత రిలయన్స్ కు తిరుగు లేకుండా పోయింది.ఒకానొక దశలో  రూపాయి విలువ  పడిపోయినా ఆ పరిస్థితులను తట్టుకొని రిలయన్స్   నిలబడింది. ఆ తరువాత దేశంలోనే అత్యుత్తమ వ్యాపార సామ్రాజ్యంగా రిలయన్స్ ను ఎదిగేలా చేసాడు ధీరు అంబానీ. 1984 లో రిలయన్స్ కంపెనీలోకి లోకి తన ఇద్దరు కుమారుల రాకతో సమూల ప్రక్షాళన జరిగింది. వారు అనుసరించిన విధానాలతో, అప్పటికే గెలుపు దారిలో దూసుకుపోతున్న రిలయన్స్, దేశంలోనే అత్యుత్తమ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.
          
                           ఆ తరువాత ధీరు భాయ్ అంబానీ  వివిధ వ్యాపార రంగాలలో అడుగిడుతూ వేల కోట్ల రూపాయల ఆదాయంతో పాటు, తన రిలయన్స్  ఉనికిని  నలుమూలలా విస్తరించేలా చేసాడు ధీరూ భాయ్.పెట్రో కెమికల్స్, టెలీ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్సటైల్స్, రిటైల్ వంటి ప్రతి రంగంలో రిలయన్స్ ముద్ర వేసాడు ధీరూ. 1962 లో భారత దేశానికీ పదిహేనువేల  రూపాయలతో  తిరిగివచ్చిన ధీరూ 2002 నాటికీ డెబ్భైదు వేల కోట్లకు అధిపతి కాగలిగాడు.2002 లో ధీరు భాయ్ అంబానీ భౌతికంగా ఈ ప్రపంచాన్ని వీడినప్పటి, ఆయన జీవించిన జీవితం, జీవితంలో వేసిన ప్రతి అడుగు నేడు  స్వయంకృషితో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి దాయకం.





                             ధీరుభాయి అంబానీ మరణం తరువాత ముకేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ మధ్య విబేధాల కారణంగా రిలయన్స్ రెండు గా చీలింది.ప్రస్తుతం ముకేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు ,అనిల్ అంబానీ తన  అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ముకేష్ అంబానీ దాదాపు 2.50 లక్షల కోట్లతో    ఆసియాలోనే అత్యంత ధనవంతునిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
              
                         గుర్తుపెట్టుకోండి.

                                   నాడు నెల జీతం కోసం దేశం కానీ దేశంలో పెట్రోల్ బంక్ లో పని చేసాడు. తన పట్టుదల తనను రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కు అధిపతిని చేస్తే, తన ఆసాధారణ ప్రతిభ దేశ ప్రజలకు ఆదర్శప్రాయుణ్ణి చేసింది. చదివింది కేవలం పదవతరగతి అయితేనేం కొన్ని లక్షల మంది ఇంజినీర్లకు ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగాడు. జీవితంలో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. అయితే కొద్ది మాత్రమే ఆ కలలను నిజం చేసుకోవటానికి రాత్రి పగలు కష్టపడి గెలుపుశిఖరాలను చేరుకొని విజయానందాన్ని అనుభవిస్తారు, అంతేకాదు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలవారవుతారు. అయితే మన వల్ల కొన్ని కోట్ల మంది ప్రభావితం కావాలంటే మనమెంత సమర్థవంతంగా ఉండాలో, మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉండాలో
 
                                                                           ఆలోచించండి,
                                                                                      ఒక్కసారి ఆలోచించండి.


                                                                                  by
                                                            M.R. Ravindra Nath Tagore
  
Read More
    2

Services

More Services

© 2014 The Tagore Times. Designed by Bloggertheme9 | Distributed By Gooyaabi Templates
Powered by Blogger.